బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.*

Homeతెలంగాణ

*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.*

*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.* *తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కాపాడుకుందాం! మతతత్వ పార్టీల విష ప్రచారాలను తిప్పి కొడదాం.* *పినపా

పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి! సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.
మతసామరస్యం వెళ్లి విరిసే విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలి
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు

*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.*

*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కాపాడుకుందాం! మతతత్వ పార్టీల విష ప్రచారాలను తిప్పి కొడదాం.*

*పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ*

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్16: సెప్టెంబర్ 17ను తెలంగాణకు విమోచన దినోత్సవం అని, భారత్‌లో విలీనమైన రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజు అని చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. చరిత్రలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి, ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల పాత్రను కనుమరుగుచేసే కుట్రలు జరుగుతునేఉన్నాయి. వాస్తవ చరిత్రను వక్రీకరించి, వక్రభాష్యాలు చెప్పి నేటి తరం తెలంగాణ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయి.
ప్రజలు తమ గత చరిత్రను సరైన విధంగా తెలుసుకున్నప్పుడు, వర్తమానంలో ఏం చేయాలో భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో నిర్ణయించుకుంటారు. కానీ నేడు 1948 సెప్టెంబర్ 17 కేంద్రంగా ప్రజలు ఏ చరిత్రను సృష్టించుకున్నారో, ఏ పోరాటాలను నిర్మించుకొని భవిష్యత్తును కలలుగన్నారో అది ఉన్నది ఉన్నట్టుగా నేడు పాలకులు, పాలకవర్గ పార్టీలు చెప్పడం లేదు. ప్రజల వీరోచిత పోరాటాల చరిత్ర కూడా ప్రచారంలో ఉండాలి. లేదంటే పాలకవర్గాలు చెప్పే తప్పుడు చరిత్రనే అసలైన చరిత్రగా మిగిలిపోతుంది. అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. కొందరు విలీనం అని, మరికొందరు విమోచనమని, ఇంకొందరు స్వాతంత్రం అని, తమ స్వార్థ రాజకీయ కార్యాచరణను మొదలుపెట్టారు. వారి వారి స్వలాభం కోసం ప్రజల చరిత్రను మభ్య పెట్టే పనిలో ఉన్నాయి. ఒకడు ఈ పోరాటాన్ని హిందూ ముస్లిం మతాల గొడవులుగా మనల్ని విభజించే కుట్ర , అందులో భాగమే రజాకార్ ఫైల్స్ సినిమా, సరిగ్గా ఇక్కడే మనం మన గత చరిత్రను అర్థం చేసుకోవాలి. ఒక మత విముక్తి దినోత్సవంగా మార్చి ఓట్ల రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోంది. ఇప్పుడు దీనిని జాతీయ వాదుల త్యాగాల ఫలితం అని కూని రాగాలు తీస్తుంది. ఈ పోరాటంలో వామపక్షాల పాత్రను తక్కువ చేసి చూపిస్తూ, ఆర్ఎస్ఎస్ లేదా హిందూ మహాసభల వల్లనే విముక్తి లభించిందనే తరహాలో విష ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపింది కమ్యూనిస్టులే. ఈ పోరాటంలో 4,000 మందికి పైగా కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. 3,000 గ్రామాలను విముక్తి చేసి, దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులదే. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్‌కు ఈ పోరాటంతో ఎలాంటి సంబంధం లేదు. ఈ పోరాటం భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగింది. పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాడి అమరులైన వారిలో మగ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్, బందగీ వంటి అనేక మంది ముస్లిం వీరులు ఉన్నారు. అలాగే నిజాం పక్షాన ఉండి ప్రజలను పీడించిన వారిలో విసునూరు రామచంద్రారెడ్డి వంటి హిందూ భూస్వాములు, దొరలు కూడా ఉన్నారు.ఈ చారిత్రాత్మక దినాన్ని తమ పార్టీ త్యాగాల ఖాతాలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. వాస్తవంగా జరిగింది ఏమిటి? 1948కి ముందు భారతదేశంలో 568 సంస్థానాలు ఉన్నాయి. ఈ అన్ని సంస్థానాల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన అంతమైంది. ఈ 568 సంస్థానాల్లో ఒక నాలుగు తప్ప మిగతావన్నీ యూనియన్ ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ఈ నాలుగు సంస్థానాలు నిజాం, జమ్మూకాశ్మీర్, జునాగర్, త్రిపుర, ఇవి నాటి యూనియన్ ప్రభుత్వంలో విలీనం అవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ నెహ్రూ ప్రభుత్వం వీటిని కలుపుకోవడానికి తీవ్రప్రయత్నం చేసింది. హైదరాబాద్ సంస్థానాన్ని వైజాం పరిపాలించేవాడు. నాటి నిజాం రాష్ట్రంలో 16 జిల్లాలు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు నజరాణాలు, పన్నులు చెల్లిస్తూ వారి తాబేదారులుగా కొనసాగుతూ వచ్చింది. నైజాం పాలనలో హైదరాబాద్ సంస్థాన ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. నైజాం రాజు. తెలంగాణ ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకోవడం, అధిక పన్నులను గుంజడం, హత్యలు, అత్యాచారాలు చేయడం, స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం చేశాడు. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా దాడి చేయడం, నిత్యం జరుగుతూ ఉండేవి. ప్రజలను పీడించడం కోసం నైజాం రాజు తన సంస్థానం అంతటా జాగీర్దారులను, జమీందారులను, భూస్వాములను, దేశముఖ్‌లను, దొరలను తన తాబేదారులుగా నియమించుకున్నాడు. నైజాం నవాబు రజాకారులతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని ప్రజలపై నిత్యం దాడులు చేస్తుండేవాడు. వీరు హిందూ, ముస్లింతోపాటు అన్ని మతాలలోని ఉన్నత వర్గాలకు, దోపిడి వర్గాలకు రక్షణ కవచంగానూ, అన్ని మతాలలోని పేద ప్రజలను హింసించే వారిగా దోపిడీ చేసేవారిగానూ ఉండేవారు. వీరి దోపిడీని వ్యతిరేకించే వారి ఊర్లను రాత్రికి రాత్రి తగలబెట్టడం ప్రజల ధన, మాన ప్రాణాలను దోచేయడం నిత్యం జరుగుతూ ఉండేది.దీనికి వ్యతిరేకంగా ప్రజలు ప్రారంభంలో ఆంధ్ర జన సంఘం పేరిట పోరాడారు. అది 1930 నాడు వచ్చేసరికి ఆంధ్ర మహాసభ పేరుతో ఉద్యమించారు. ఈ ఆంధ్ర మహాసభనే తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. వెట్టి చాకిరి, అధిక శిస్తు వసూళ్లకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి నినాదంగా ఆంధ్ర మహాసభ పని చేసింది. అది 1946కు వచ్చేనాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రపంచ చరిత్రలోనే గొప్ప ప్రాముఖ్యత ఉంది. భూమి తల్లి ఒడిలో తమ చెమటను చిందించి పసిడి సిరులను పండించే మట్టి మనుషుల చేత బందూక్ పట్టించింది. దొరలు, భూస్వాములపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ పోరాటంలో వేలాది మంది యోధులు తమ జీవితాలను అర్పించారు. షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు నాటి పోరాటంలో తమ ప్రాణాలను అర్పించారు. విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి అయిలమ్మ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొత్తం నైజాం రాజ్యం అంతట విస్తరించింది. ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను ప్రజలు సొంతం చేసుకున్నారు. 3000 గ్రామాల్లో నైజాం అధికారానికి దీటుగా ప్రజారాజ్యాలను నెలకొల్పుకున్నారు. దొరలు, భూస్వాములు, జాగిర్దారుల చేతుల్లో ఉన్న భూమి అంతా వాటి కమ్యూనిస్టు పార్టీ గ్రామ సభలు నిర్వహించి భూమిలేని ప్రజలకు పంచి పెట్టింది.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా నైజాం రాజు తన పాలన కొనసాగించలేకపోయాడు. నైజాం రాజు అన్ని రకాలుగా బలహీనమైపోయాడు. కమ్యూనిస్టులు పూర్తిగా తమ అధీనంలోకి తెలంగాణాను తీసుకునే సమయం. ఈ పోరాటం దేశవ్యాప్తంగా అంటుకొని ఎక్కడ ప్రజలు భూస్వాములు మీద తిరగబడతారో ఆని అలోచించిన నాటి ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నిజాం నవాబు సహకారంతో దండయాత్ర చేసింది. వాస్తవానికి నిజాం నవాబు అప్పటికే జరిగిన ప్రజా -పోరాటాల వల్ల బలహీనమైన కారణంగా నాటి నెహ్రూ పటేల్ సైన్యాలు చేసిన ఒక్కరోజులోనే లొంగిపోయాడు. భారత సైన్యం నిజాం నవాబు లక్ష్యంగా దండయాత్ర చేస్తే తాను లొంగిపోయిన తర్వాత కూడా సైన్యం దురాక్రమణ కొనసాగింది. దాదాపు 600 రోజులు వీరు తెలంగాణలోని ప్రతి పల్లెలో దురాక్రమణలను కొనసాగిస్తూ అరాచకం సృష్టించారు. ప్రజలను, విప్లవకారులను అనేక మందిని చెట్లకు కట్టేసి పిట్టల్ని కాల్చి చంపినట్టు చంపారు. అంతేకాదు నిజాం నవాబుకు ‘రాజ్ ప్రముఖ్’ అనే బిరుదు ఇచ్చి కోటిన్నర రూపాయలను నజరానాగా ఇచ్చింది. ప్రజలను చిత్రహింసలు పెట్టిన ఖాసీం రజ్వీ పాకిస్తాన్ పారిపోవడానికి సహకరించారు. ఇదంతా నెహ్రూ నైజాం నవాబ్ కుమ్మక్కులో భాగంగా జరిగిన తతంగం. నెహ్రూ పటేల్ సైన్యాలు ఆ తరువాత కమ్యూనిస్టుల కేంద్రంగా దాడులు చేసింది. అనేకమంది ప్రజలను ఊచకోత కోశారు. 4000 మంది కమ్యూనిస్టు విప్లవకారులను చంపివేశారు. కమ్యూనిస్టులు పంచి పెట్టిన భూమిని తిరిగి భూస్వాములకు అప్పుచెప్పారు.( ఇప్పుడు ఆ భూస్వాములే నేడు రాజకీయ నాయకులైనారు. సినీ నిర్మాతలైనారు. బడా వ్యాపార వెయ్యాలైనారు. ఆ భూస్వాములే చరిత్రను వక్రీకరిస్తున్నారు.) అలాంటప్పుడు ఇది ఏ రకంగా విలీనం, విమోచనం, స్వతంత్రం అవుతుంది.ప్రధానంగా హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా బీజేపీ దీన్ని సృష్టిస్తోంది. నిజాం నవాబు ముస్లిం అయినా తన కింద పని చేసిన భూస్వాములు, జాగదారులు, దేశ్ ముఖ్‌లు హిందూ మతంలోని ఉన్నత వర్ణాల వారే. వీరిద్దరూ కలిసి అన్ని మతాలలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దాడులు చేశారు. అలాంటప్పుడు ఇది వీరు చెబుతున్నట్లు విమోచనం ఎలా అవుతుంది? నిజాం నవాబు 1947 కన్నా ముందే సామంత రాజుగా, బ్రిటిష్ పాలకవర్గాలకు తాబేదారుగా పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు దీనిని విలీనం, స్వతంత్రం అనలేము. దీనికి సంబంధించి బీజేపీది మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వైఖరి కాగా, మిగతా పార్టీలు అవకాశవాదంతో చరిత్రను వక్రీకరిస్తున్నాయి. నాడు మనం సాధించుకున్న హక్కులను, భూములను నిజాం నవాబు బూచిగా చూపెట్టి నెహ్రూ, పటేల్ సైన్యాలు హరించి వేశాయి.. దీనికి వ్యతిరేకంగా నిలబడిన ప్రజలను, కమ్యూనిస్టులను ఊచకోత కోసాయి.నాటి తెలంగాణ సాయుధ పోరాటం అనవాళ్లు తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా నేటికీ సజీవంగా మనకు సాక్షాత్కారిస్తాయి. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కొనసాగింపు ఇష్టం లేని వాళ్ళు, ప్రజలను మభ్య పెట్టి రకరకాలైన వాదనలను తెరమీదకు తీసుకొస్తున్నారు. చరిత్రను చరిత్రగా ఉంచితేనే మంచిది. ఒకానొక చారిత్రక సందర్భంలో ప్రజలు తమ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. అందుకే ఇంతటి మహోజ్వల చరిత్రకు వక్రభాశ్యాలు చెబుతున్నారు. అయినా అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు, వారి చరిత్రను వారే నిర్మించుకుంటారు.

*విలీనమూ లేదు.. విమోచన అంతకంటే లేదు!*

1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైనట్లు కనిపించినా, అది అసంపూర్ణమే. నిజాం ప్రభువుకు తగిన గౌరవమే దక్కింది. ఆయనకు ఎలాంటి శిక్షా విధించలేదు. ఆయన అరాచకాలు కూడా కొనసాగాయి. విమోచనం జరిగింది, అనుకుంటే నిజాం ఇక్కడి నుండి పారిపోవాలి లేదంటే అతని అధికారాలు, ఆస్తులు జప్తు చేయబడాలి. చేసిన దుర్మార్గాలకు గాను శిక్ష అనుభవించాలి. కానీ అలాంటివేమి జరగలేదు. భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య యథాస్థితి కొనసాగించే ఒప్పందం మాత్రమే కుదిరింది. సర్ఫేఖాస్ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఏడవ నిజాం నవాబు ప్రజలను పీడించి కూడబెట్టిన బంగారం, నగలు, వజ్రాలు ఇతర దేశాలకు స్వేచ్ఛగా తరలించబడ్డాయి. అంతేకాదు 1850 జనవరి నుండి 1956 అక్టోబర్ వరకు రాజ్‌ ప్రముఖ్‌గా రాజభవన్‌లోనే ఉండి అధికారం చలాయించారు. ఆపరేషన్ పోలో తర్వాత1971 వరకూ సంవత్సరానికి 50 లక్షలు రాజభరణంగా నిజాంకు చెల్లించారు. వీటికి పన్ను మినహాయింపు ఇచ్చారు. గ్రామాలలో 1948 నాటికి ప్రజల తిరుగుబాటు పెరిగి, కమ్యూనిస్టు పార్టీ బలపడడం భారత ప్రభుత్వం గమనించింది. దీనికి తోడు దున్నే వాడిదే భూమి ప్రాతిపదికగా 10 లక్షల ఎకరాలు ప్రజల స్వాధీనం అయ్యింది. 3000 గ్రామాలలో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడ్డాయి. దీనిని ప్రమాదంగా భావించిన భారత ప్రభుత్వం (నాటి కాంగ్రెస్ పార్టీ) నిజాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుమించి విలీనం జరగలేదు. విమోచన అంతకంటే జరగలేదు. అందుకే 1948 సెప్టెంబర్ 17లో జరిగింది విద్రోహమే.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: