సబ్స్టేషన్లో మద్యం కలకలం.. 8 మంది విద్యుత్ సిబ్బందిపై వేటు! నలుగురిపై సస్పెన్షన్.. ముగ్గురి సర్వీసు తొలగింపు.. మరొకరికి టెర్మినేషన్ ఉత్తర్వులు
సబ్స్టేషన్లో మద్యం కలకలం..
8 మంది విద్యుత్ సిబ్బందిపై వేటు!
నలుగురిపై సస్పెన్షన్.. ముగ్గురి సర్వీసు తొలగింపు.. మరొకరికి టెర్మినేషన్ ఉత్తర్వులు
ఖానాపురం, నవంబర్ 3 ( నమస్తే భారత్) :
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్ శాఖ యాజమాన్యం స్పష్టం చేసింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళావారిపేట సబ్స్టేషన్లో పట్టపగలే మద్యం సేవించిన ఘటనకు సంబంధించి ఎనిమిది మంది విద్యుత్ సిబ్బందిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై విచారణ అనంతరం నలుగురిని సస్పెండ్ చేయగా, ముగ్గురిని సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించింది. మరో ఉద్యోగికి టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
*విజిలెన్స్ విచారణ.. యాజమాన్యం చర్యలు*
2026 అక్టోబర్ 29న ఖానాపురం మండలం మంగళావారిపేట సబ్స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యుత్ శాఖలో కలకలం రేపింది. సబ్స్టేషన్లో సిబ్బంది మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణల మేరకు ఏపీ టీఎస్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి, సమగ్ర నివేదికను యాజమాన్యానికి సమర్పించారు.విజిలెన్స్ నివేదికను పరిశీలించిన అనంతరం యాజమాన్యం సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. మొత్తం ఎనిమిది మందిపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఖానాపురం మండల విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ తెలిపారు.
*సస్పెన్షన్కు గురైన సిబ్బంది వీరే*..
సస్పెన్షన్కు గురైన వారిలో బి. నాగయ్య (ఎస్ఎల్ఐ), పి. రాజు (ఎల్ఐ), ఏ. రామచంద్రయ్య (ఏఎల్ఎం), షేక్ బషీర్ (ఏఎల్ఎం) ఉన్నారు.అదేవిధంగా ప్రశాంత్, మురళి, సాయిమల్లును సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించగా, ఎం. చంద్రమౌళికి టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడైంది.
*విధుల్లో నిర్లక్ష్యంపై కఠిన వైఖరి*
విద్యుత్ సరఫరా వంటి కీలకమైన సేవల్లో పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణను పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవనే సంకేతాన్ని ఈ ఘటన ద్వారా యాజమాన్యం ఇచ్చింది.
విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా తీసుకున్న ఈ చర్యలు విద్యుత్ శాఖలో విధి నిర్వహణ, క్రమశిక్షణకు ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

COMMENTS