పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలి 200 రోజులు పని కల్పించి, రోజుకు రూ.800 కూలి చెల్లించాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా
పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలి

200 రోజులు పని కల్పించి, రోజుకు రూ.800 కూలి చెల్లించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, షాద్నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్
నమస్తే భారత్ షాద్నగర్, నవంబర్06: ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి షాద్నగర్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివెళ్లినట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, షాద్నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ తెలిపారు.
ఆయన ఆధ్వర్యంలో షాద్నగర్ ప్రాంతంలోని వివిధ గ్రామాల నుంచి ఉపాధి హామీ కూలీలు, మేట్లు, కార్మిక సంఘం నాయకులు హైదరాబాద్కు వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో నివసిస్తున్న పేదలు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని కోరారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజువారీ కూలిని రూ.800కు పెంచాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పట్టణ ప్రాంతాల్లో పథకం అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి, నిరుద్యోగులు, పేద కుటుంబాలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలని అన్నారు. పారిశుధ్యం, చెరువుల సంరక్షణ, పచ్చదనం పెంపు, వర్షపు నీటి సంరక్షణ, ప్రజా మౌలిక వసతుల అభివృద్ధి పనులను పథకం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
సీనియర్, సాధారణ మేట్ల సేవలను ప్రభుత్వం గుర్తించి కనీస వేతనాలు నిర్ణయించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను అర్హులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశాల్లో తాగునీరు, మెడికల్ కిట్లు, వేసవి అలవెన్స్, పనిముట్లు అందించాలని, ఆన్లైన్ మస్టర్ పేరుతో కూలీలను ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి కల్పించి వారి జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీను నాయక్ అన్నారు. ఉపాధి హామీ కూలీల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

COMMENTS